జీవిత ప్రాధమిక సూత్రము 1
జీవిత సూత్రము 1
దేవునితో వ్యక్తిగత సంబంధము అనునది మన జీవితములో ప్రధమ స్థానము లో ఉండాలి. ఇది మన జీవితము యొక్క గమనమును నిర్దేశిస్తుంది. ఆది 1:26
దేవుడు తన స్వరూపమునందు తన పోలికె చొప్పున మనలను సృజించినారు. ఆయన మనతో సహవాసము చేయటము, మనము ఆయనను ఆరాదించటము మనయొక్క సృష్టి వెనుక ఉన్నటువంటి ఉద్దేశ్యము. మనమందరమూ కూడా మనకొరకు, చింతించి, మనలను ప్రేమిస్తూ, మన క్రేమాభివృద్ది కాంక్షించే వ్యక్తి ఒకరు ఉన్నారు అని మనము తెలుసుకోవాలి. ఆయన మనలను మాటలతో చెప్పలేనటువంటి ఆసక్తితో ప్రేమించుచున్నాడు. మనకోసము తన రక్తము, ప్రాణము సహితము ధారపోశాడు. మనము ఆయనకు లోబడినట్లయితే మనలను బహుగా ఆశీర్వదించి మన జీవితమును మంచి అభివృద్ది లోనికి తీసుకొనివచ్చును.
దేవుడు సమస్తమును ధారపోయును
తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? (రోమా 8:32)
మనము నశించకూడదు అని తన స్వంత కుమారుని మనకొరకు అపరాధపరిహారార్ధ బలిగా అర్పించినాడు. మనకు ఇచ్చు విషయములోను, మనకొరకు ఏదైనా చేసే విషయములోను ఆయన ఎప్పుడూ వెనుకతీయడు. మన మేలుకోసము తన సమస్తమును కూడా ధారపోసి త్యాగము చేయగలడు.
దేవుడు గొప్ప ప్రణాళిక కలిగియున్నాడు
నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు. (యిర్మియా 29:11)
దేవుడు మన యెడల గొప్ప ప్రణాళిక కలిగియున్నాడు. మన జీవితములో ఒక్కోసారి వచ్చే వ్యతిరేక పరిస్తితులు మనలను కలవార పెట్టినా, దేవుడు నమ్ముకున్న తరువాత ఇలా ఎందుకు జరిగింది అని అనిపించినా సరే బయపడవలసిన అవసరము లేదు. అవి చివరకు సమాధానము కలిగించేవే తప్ప దేవుడు ఏ విధమైన నాశనమునకు నిన్ను అప్పగించడు. ఇవి అన్నీ కూడా మనకు దేవుని యందు ఉండవలసిన నిరీక్షణ నేర్పిస్తాయి. దేవుడు ఎప్పుడూ ఎవరికీ ఉద్దేశ్యపూర్వకముగా హాని చేయడు.
దేవుడు నీకు ఏదీ తక్కువ చేయడు
సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయై యుండదు. (కీర్తనలు 34:10)
దేవుడు మనకు ఏ కొదువ రానియ్యడు. మనుష్యరీతిగా మనము కంగారుపడుతూ ఉంటాము కాని దేవుడు మనకు కావలసినవి తగిన సమయమున మనకు దయచేయును. ఆయన మనలను ఎప్పుడూ అనాధలుగా విడువడు. మనము లేమిలో ఉంటే చూసి ఆనందించే దేవుడు కాదు ఆయన. తన మహిమైశ్వర్యములో మన ప్రతి అవసరము తీర్చును. ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ మనమీద ఉంటుంది. ఆయన ఎప్పుడూ కునుకడు, నిద్రపోడు.
దేవుని వైపు తిరుగుము
యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు కొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవా వైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు.
ఆకాశములు భూమికి పైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించు వానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చు వచనమును ఉండును నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.
మీరు సంతోషముగా బయలువెళ్లుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును. ముండ్లచెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదుగును అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచన గాను ఉండును. (యెషయా 55:6-13)
ఒకవేళ ఏదేని కారణము చేత దేవునికి దూరముగా జరిగిన యెడల, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు భయము కలిగించేలా ఉన్నా, వెంటనే దేవుని దగ్గరకు మరలండి. ఆయన మార్చలేని పరిస్థితి అంటూ ఏదీ కూడా లేదు. ఆయన జ్ఞానము మన జ్ఞానము కన్నా ఎంతో గొప్పది. మన కష్టములు, చీకటి, సంతోషముగాను, వెలుగుగాను మారును. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగును.
దేవుని ప్రేమించినవారు
ఈ విధముగా దేవునికి తమ జీవితములలో అధిక ప్రాధాన్యత ఇచ్చి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన బైబిలునందు గల కొందరి జీవితముల యొక్క ఉదాహరణలు
హెబ్రీయులకు 11వ అధ్యాయమునందు విశ్వాస వీరులు విశ్వాస వీరనారీమణులు
దేవుని విషయమునందు ఆసక్తి కలిగిన ఫీనెహాసు (సంఖ్యాకాండము 25:10-13)
ఇశ్రాయేలీయులకు తల్లి వంటి దెబోరా (న్యాయాధిపతులు 4, 5 అధ్యాయములు)
సన్నిహిత సంబంధము కొరకు తృష్ణ కలిగిన హోషేయ (హోషేయ 11:1-9)
ఆసక్తి కలిగి ఆరాదించిన 3 జ్ఞానులు (మత్తయి 2:1-12)
ధైర్యముగా ఒప్పుకొనిన శతాధిపతి (మార్కు 15:39)
దేవునికి జీవితము సమర్పించిన మరియ (యోహాను 12:1-8)
రక్షకుని ప్రకటించిన స్తెఫెను (అపోస్తలుల కార్యములు 7:59, 60)
దేవుని ఘనపరచిన తిమోతి (1తిమోతి 1:2, 18)
వెనుక ఉండి పరిచారము చేసిన లూకా (2తిమోతి 4:11)
విడిచిపెట్టబడిన వారితో దేవుని సేవ చేసిన తీతుకు (తీతుకు 1:4)
మార్పు చెందిన ప్రభువు సహోదరుడు యాకోబు (యాకోబు 1:1)
పౌలుగా మారి గొప్ప దేవుని పరిచర్య చేసిన సౌలు
చేపలు పట్టే వృత్తి నుంచి మనుష్యులను పట్టువారుగా మారిన అపోస్తలులు
అనేక సంవత్సరములుగా ప్రభువు చేత తాకబడి మార్పుచెందిన ఎంతోమంది జీవితములు,
నీతో నాతొ కలిపి
Comments
Post a Comment