ప్రత్యక్ష గుడారం పార్ట్ 2
ప్రత్యకపు గుడారము
Part 2
ప్రత్యకపు గుడారము ప్రాముఖ్యత (ఈ అంశాన్ని నిర్లక్ష్యము చేసే ప్రతి ఒక్కరు తప్పక చదవండి)
దేవుడు మానవుల మధ్య నివసించుటకు ఆశించిన గుడారమే ప్రత్యక్ష గుడారము. ఈ ప్రత్యక్ష గుడారము గురించి అందులో బలులు - అర్పణలు గురించి 50 అధ్యాయాలలో పైగానే రాయబడింది... చాలా మంది ప్రత్యక్ష గుడారము టాపిక్ రాగానే దీనితో ఏమి అవసరములే, మనకు క్రొత్త నిబంధన ఉంది కదా, అది చాలులే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ క్రొత్త నిబంధన లో కూడా పరిశుద్దాత్మ దేవుడు ప్రత్యక్ష గుడారము గురించి హెబ్రీ పత్రికలో 4 అధ్యాయాలలో రాయించాడు. ఈ అధ్యాయాలు అర్థం కావాలంటే నిర్గమ, లేవి, సంఖ్యా కాండాల మీద తప్పక అవగాహన ఉండాలి. క్రొత్త నిబంధనలో కూడా ప్రత్యక్ష గుడారము గురించి దేవుడు రాయించాడు అంటే ఈ అంశము ద్వారా దేవుడు తన సంఘానికి ఏదో నేర్పించాలి అని ఆశిస్తున్నాడు అనేగా అర్థం. 2 తిమోతి 3:16,17 ప్రకారం పరిశుద్దాత్ముడు రాయించిన ప్రతి లేఖనము ప్రయోజనకరమైనది కదా! కానీ ఈరోజు సంఘము ప్రత్యక్ష గుడారమును ప్రయోజనకరమైనదిగా భావించకపోవడం బాధాకరం.
క్రీస్తునందు నా ప్రియమైన సహోదరులారా ప్రత్యక్ష గుడారము గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. "ప్రస్తుతానికి ఈ పోస్ట్ లో కొన్ని విషయాలు తెలుసుకొందాము. తరువాయి భాగములో మిగతా విషయాలు తెలుసుకొందాము."
ప్రత్యక్ష గుడారము దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. ప్రత్యక్ష గుడారము ప్రాముఖ్యంగా 3 అంశాలను తెలియచేస్తుంది.
1) ప్రత్యక్ష గుడారము పరలోక సంబంధమగు సంగతులకు సాదృశ్యంగా ఉంది. (హెబ్రీ 8:5). అనగా పరలోకంలో ఆరాధనా స్థలం (ఆలయం) ఒకటి ఉంది. అక్కడ దేవుడు అత్యున్నత సింహాసనాసీనుడై కెరూబుల మధ్య నివసిస్తున్నాడని కీర్తనలు 11:4 ; ప్రకటన 7:15 ; 2 రాజులు 19:15 లేఖనాలు సెలవిస్తున్నాయి. అదే విధంగా మనము ప్రత్యక్ష గుడారమును గమనించినట్లైతే "అతి పరిశుద్ద స్థలంలో" కరుణా పీటం ఉంటుంది. కరుణా పీటం దేవుని సింహాసనాన్ని సూచిస్తుంది. ఆ కరుణా పీటం మీద రెండు కెరూబులు చేయబడి ఉంటాయి. వాటి మధ్య నుండి నేను మాట్లాడతాను అని దేవుడు తెలియచేసాడు. (నిర్గమ 25:22 ; 1 సమూయేలు 4:4)
నిర్గమ 25:8 లో నేను వారిలో నివసించునట్లు నాకు పరిశుద్ద స్థలం నిర్మింపవలెను అని దేవుడు సెలవిచ్చాడు. ప్రకటన 21 వ అధ్యాయాన్ని గమనించినట్లైతే పరలోక సంబంధమగు జెరూసలేము పట్టణముతో (తనని విశ్వసించిన ప్రజలతో) దేవుని నివాసం శాశ్వతంగా వుండబోతుందని మనకు తెలుస్తుంది, అందుకు ఈ లోకంలో కట్టబడిన ప్రత్యక్ష గుడారము ముంగుర్తుగా దేవుని నివాస స్థలముగా నిర్మించబడింది... ఈ విధంగా ప్రత్యక్ష గుడారము పరలోక సంబంధమైన సంగతులకు సాదృశ్యంగా వుంది.
2) ప్రత్యక్ష గుడారము ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా వున్నది. ప్రత్యక్ష గుడారము ఒక ఛాయా (నీడ) మాత్రమే.... నీడ ఏర్పడాలి అంటే అసలు వస్తువు ఉండాలి కదా, ఆ అసలు వస్తువే మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు. అసలు ప్రత్యక్ష గుడారములోని ప్రతి వస్తువు యేసు క్రీస్తు పరిచర్యను, దైవత్వాన్ని, వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నాయి.... (అవన్నీ వివరంగా ముందు భాగములలో తెలుసుకుందాము.)
3) ప్రత్యక్ష గుడారము సంఘాన్ని సూచిస్తుంది. ప్రత్యక్ష గుడారము అరణ్యములో కట్టబడుతుంది... అరణ్యములో ప్రయాణించబడుతుంది.... తర్వాత కనానుకు చేర్చబడుతుంది.... అదే విధంగా "సంఘము" కూడా ఈ అరణ్యంలాంటి లోకంలో కట్టబడింది. ఇప్పుడు సంఘము కూడా ఈ లోకంలో ప్రయాణించి "పరమ కానానుకు" అనగా పరలోక సంబంధమగు జెరుసలేము పట్టణముకు చేరవలసి వుంటుంది... అక్కడ మన నివాసం దేవునితో శాశ్వతంగా ఉండిపోతుంది. మరో రకంగా చెప్పాలంటే అరణ్యంలో ప్రత్యక్షపు గుడారము దేవుని నివాస స్థలం అయితే (నిర్గమ 25:8) నేడు "సంఘం దేవుని నివాస స్థలం" ఈ సంఘం క్రీస్తు అను సజీవమగు రాయిపై కట్టబడిన విశ్వాసుల సమూహము. నేడు దేవుడు "రాళ్ళతో కట్టబడిన మందిరాలలో నివాసం చేయడు. కాని ప్రజలు అనబడే ఆధ్యాత్మిక ఆలయాలలో నివాసం ఉంటాడు. (1 కొరింథీ 3:16-17).
"ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను." మత్తయి 18:20
ఈ విధంగా ప్రత్యక్ష గుడారము, ప్రత్యక్ష గుడారములోని 7 పరికరములు, వాటిని తయారు చేయడానికి వాడిన వస్తువులు అనేక విషయాలను తెలియచేస్తాయి. ఒక సంఘము (విశ్వాసులు) ఎలా ఎదగాలి అనేది కూడా ప్రత్యక్ష గుడారము తెలియచేస్తుంది.... వీటి గురించి క్లుప్తంగా ముందు ముందు భాగాలలో తెలుసుకుందాము. యిది కేవలము ఒక భాగము మాత్రమే అని గమనించండి.
Comments
Post a Comment