ప్రత్యక్ష గుడారం పార్ట్ 3
ప్రత్యక్ష గుడారము
Part 3
ఈ పోస్ట్ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ కోసం. ఈ ప్రత్యక్ష గుడారము అంశము మీద ఆసక్తి కలిగిన వారి కోసం ఈ ప్రత్యక్ష గుడారము కట్టబడిన విధానం వివరించడం జరిగింది. కొంతమందికి అనవసరం అనిపించినప్పటికీ బైబిల్ పట్ల ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానించే వారికి ఉపయోగపడుతుందని భావించి చేయడం జరిగింది... (ముందు భాగాలు కూడా చదవండి)
ప్రత్యక్ష గుడారము కట్టబడిన విధానం :
ప్రత్యక్ష గుడారమును ఏ విధంగా నిర్మించారో నిర్గమ 26,36 అధ్యాయాలు మరియు నిర్గమ 27:9-17 వచనాలు, 38:9-20 వచనాలు తెలియచేస్తున్నాయి. ప్రత్యక్ష గుడారము కట్టబడిన విధానం అర్థం చేసుకోవడం కాస్త కష్టతరం. అయినప్పటికీ కాస్త మీకు అర్థం అవ్వులాగున వివరించడం జరిగింది ఆలకించండి.
1) పునాది (నిర్గమ 26:15-30 ; 36:20-34)
ప్రత్యక్ష గుడారము పునాదికి తుమ్మకర్రతో చేయబడిన 48 పలకలను, 96 వెండి దిమ్మలను ఉపయోగించారు. ప్రతి పలక పొడుగు 10 మూరలు (15 అడుగులు), వెడల్పు మూరెడునర (2:25 అడుగులు), ప్రతి పలక అడుగు భాగాన రెండు కుసులు (Tenons or pegs) ఉంటాయి. ఈ "కుసులు" పలకలను వెండి దిమ్మలను కలుపుతాయి. ప్రతి పలకను ఈ కుసుల సహాయంతో 2 దిమ్మల మీద నిలబెడతారు. అలా కుడివైపును 20 పలకలను 40 వెండి దిమ్మల మీద, ఎడమ వైపున 20 పలకలను 40 వెండి దిమ్మలమీద, వెనుక భాగమున 6 పలకలను 12 వెండి దిమ్మల మీద, మూలలకు 2 పలకలను 4 వెండి దిమ్మల మీద నిలబెడతారు. ముందు భాగమున అనగా తూర్పున గుడారపు ద్వారము ఉంటుంది. అలా పలకలను వెండి దిమ్మల మీద నిలబెట్టిన తర్వాత తుమ్మకర్రతో అడ్డకర్రలను 3 భాగములుగా చేసి కుడివైపున 5, ఎడమ వైపున 5, వెనుక భాగమున 5 అడ్డ కర్రలను "బంగారు ఉంగరములతో" పలకలకి అమర్చుతారు. యిందులో "నడిమి అడ్డకర్ర" ఈ కొస (corner) నుండి, ఆ కొస వరకు వుంటుంది (end to end). ఆ తర్వాత పలకలకు, అడ్డకర్రలకు బంగారు రేకును పొదిగిస్తారు. తర్వాత నేలకు మేకులను కొట్టి, ఆ మేకులను పలకని కలుపుతూ త్రాళ్ళు కడతారు. యిది పునాది (నిర్గమ 35:18 ; 38:31).
2) అడ్డతెర :
ఇప్పుడు నీల ధూమ్ర రక్త వర్ణములు గల (blue, purple, scarlet yarn) అడ్డతెరని పేనిన సన్ననారతో (fine woven linen) చేసి ఆ అడ్డతెర మీద కెరూబులను చిత్రీకరిస్తారు. ఇప్పుడు ఈ అడ్డతెరను తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకుతో పొదిగించబడిన 4 స్తంభముల మీద ఈ అడ్డతెరను వేస్తారు. ఈ 4 స్తంభాలను 4 వెండి దిమ్మల మీద నిలబెడతారు. ఈ స్తంభములకు బంగారు వంకులు (hooks) వుంటాయి. ఈ వంకులకు అడ్డతెరను తగిలిస్తారు. ఇప్పుడు ఈ అడ్డతెర లోపల భాగాన్ని "అతి పరిశుద్ద స్థలము అని, అడ్డతెర వెలుపటి భాగాన్ని పరిశుద్ద స్థలము అని అంటారు. (నిర్గమ 26:31-33 ; 36:35-36).
3) గుడారపు ద్వారము :
ఇప్పుడు ఈ గుడారపు ద్వారమునకు తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగించబడిన 5 స్తంభములను, 5 యిత్తడి దిమ్మల మీద నిలబెడతారు. ఈ స్తంభములకు బంగారు వంకులు వుంటాయి. ఈ 5 స్తంభములను ఒకదానితో ఒకటి కలుపుతూ "పెండే బద్దలు" (rods, కర్ర) ఉంటాయి. ఈ పెండే బద్దలు కూడా బంగారు రేకుతో పొదిగింపబడి ఉంటాయి. ఇప్పుడు నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్న నారతో ఒక తెరని చేసి ఆ స్తంభములకు వున్నటువంటి బంగారు వంకులకు తెరను తగిలిస్తారు. యిదే గుడారపు ద్వారము (నిర్గమ 26:36-37 ; 36:37-38).
4) తెరలను కప్పుట :
నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్న నారతో 10 తెరలను చేసి, ఆ 10 తెరల మీద కెరూబులను చిత్రీకరిస్తారు. ఒక్కొక్క తెర పొడుగు 28 మూరలు (42 అడుగులు), వెడల్పు 4 మూరలు (6 అడుగులు) ఉంటుంది. ఇప్పుడు 5 తెరలను ఒకదానితో ఒకటి కలిపి మొదటి కూర్పుగా (coupling, set) చేస్తారు. ఈ కూర్పు చివరన "50 కులుకులను (loops)" చేస్తారు. మిగతా 5 తెరలను కూడా ఒకదానితో ఒకటి కలిపి రెండవ కూర్పుగా చేసి కూర్పు చివరన 50 కొలుకులు చేస్తారు. ఆ తర్వాత "50 బంగారు గుండీలను" చేసి వాటిని కొలుకులకు తగిలించి రెండు కూర్పుల తెరలను కలుపుతారు. ఇప్పుడు ఈ తెరలను పలకల మీద కప్పుతారు. ఈ తెరలు లోపల ఉన్నవారికి మాత్రమే కనపతాయి.
తర్వాత ఈ తెరల మీద మేక వెండ్రుకలతో చేయబడిన తెరలను గుడారంగా కప్పుతారు. ఈ మేక వెండ్రుకల తెరలు 11 ఉంటాయి. ఒక్కొక తెర పొడుగు 30 మూరలు (45 అడుగులు) వెడల్పు 4 మూరలు (6 అడుగులు) ఉంటుంది. ఈ తెరలు కూడా 5 తెరలు కలిపి ఒక కూర్పుగా (coupling or set), 6 తెరలు కలిపి రెండో కూర్పుగా చేయబడతాయి. ఈ కూర్పుల తెర చివరన కొలుకులు (loops) చేస్తారు. వాటిని "యిత్తడి గుండీలతో" కలుపుతారు. తర్వాత ఈ తెరల మీద పైకప్పుగా యెర్ర రంగు వేసిన పొట్టేల తోళ్ళని, సముద్ర వత్సల తోళ్ళని కప్పుతారు.
యిది "ప్రత్యక్ష గుడారము". ఈ గుడారము లోపల పరిశుద్ద స్థలము, అతి పరిశుద్ద స్థలము అని రెండు భాగాలు ఉంటాయి. (నిర్గమ 26:1-14; 36:9-19) ఈ ప్రత్యక్ష గుడారము ఆవరణము గురించి తర్వాత భాగంలో తెలుసుకుందాము.
ఈ ప్రత్యక్ష గుడారము కట్టబడుటకు వాడిన తెరలు, కుసులు, పలకలు, దిమ్మలు, గుండీలు, మిగతా వాడబడిన వాటి అన్నిటి గురించి, అసలు అవి ఏమి సూచిస్తున్నాయో, మనకు ఏమి నేర్పిస్తున్నాయో ముందు ముందు భాగాలలో తెలుసుకుందాము.
Comments
Post a Comment