నిరీక్షణ 1

              💐💐💐💐నిరీక్షణ💐💐💐💐

యిర్మీయా 29:11 నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు *నిరీక్షణ* కలుగునట్లుగా అవి సమాధానకర మైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.

మీకున్న నిరీక్షణను బట్టి సంతోషించండి. నిరీక్షణ లంగరు లాంటిది. (హెబ్రీ 6:19) సముద్రంలో తుఫానులు వచ్చినప్పుడు ఓడ బద్దలవ్వకుండా కాపాడే లంగరులా నిరీక్షణ మనం ఆధ్యాత్మికంగా దెబ్బతినకుండా కాపాడుతుంది. 1 తిమో 1:18, 19

మనం అనుకున్నవి జరగకపోవడం, ఆస్తి నష్టం, చాలాకాలంగా ఉన్న అనారోగ్యం, ప్రియమైన వాళ్లు చనిపోవడం, లేదా మన యథార్థతకు ప్రమాదం కలిగించే ఇంకేవైనా, సముద్రంలో వచ్చే తుఫానుల్లాంటివే.

విశ్వాసం, నిరీక్షణ మనకు వాగ్దానం చేసిన బహుమానాన్ని స్పష్టంగా చూడడానికి సహాయం చేస్తాయి. 2 కొరిం 4:16-18; హెబ్రీ 11:13, 26, 27

కాబట్టి మన నిరీక్షణ పరలోకం అయినా, భూమ్మీద అయినా దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాలను క్రమంగా ధ్యానిస్తూ శక్తిని పొందుతూ ఉండాలి. అప్పుడు, మనం బాధల వల్ల కృంగిపోయినా మన ఆనందాన్ని కాపాడుకోవచ్చు.1 పేతు 1:6, 7.

మన నిరీక్షణను బట్టి ఆనందిద్దాం ‘ఆ నిత్యజీవ నిరీక్షణను అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను.’—తీతు 1:1, 2.

మన నిరీక్షణ నిజమవడాన్ని చూడాలంటే మనం ఎలాంటి ‘పరిశుద్ధమైన ప్రవర్తనను’ కలిగివుండాలి, ఎలాంటి ‘భక్తితో కూడిన క్రియలు’ చేయాలి?

దేవుడు ఇచ్చిన నిరీక్షణ మనం కష్టాల్ని తట్టుకునేందుకు సహాయం చేస్తుంది.
ప్రభువు “నిరీక్షణకర్తయగు దేవుడు” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. మనం ‘విస్తారమైన నిరీక్షణ గలవారమగుటకు దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని’ ఇస్తాడని, ‘విశ్వాసం ద్వారా మనలను సమస్తానందముతో, సమాధానముతో’ నింపుతాడని కూడా ఆయన అన్నాడు. (రోమా. 15:13)

మనలో నిరీక్షణ ఉంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొన గలుగుతాం. అంతేగాక ఆనందంగా, సమాధానంగా ఉంటాం. ఆ నిరీక్షణ ‘నిశ్చలమును, స్థిరమునై ఆత్మకు లంగరువలే’ పనిచేస్తుంది. హెబ్రీ. 6:17-19

జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు మనం మన నిరీక్షణపై ఆధారపడవచ్చు. అంతేకాక దానివల్ల మనం, అనుమానంతో లేదా అవిశ్వాసంతో కొట్టుకొని పోకుండా ఉండగలుగుతాం.—హెబ్రీయులు 2:1; 6:11

ఈ అంత్యదినాల్లో జీవిస్తున్న క్రైస్తవులకు పరలోకంలో అమర్త్యమైన జీవం పొంది క్రీస్తు రాజ్యంలో ఆయనతో కలిసి రాజులుగా, యాజకులుగా సేవ చేసే నిరీక్షణ ఉంది. (లూకా 12:32; ప్రక. 5:9, 10)

మనకున్న నిరీక్షణను గురించి కొన్ని విషయాలు పరిశీలన చేద్దాం.

మొదటిగా దేవుడు మనకిచ్చిన నిరీక్షణ *‘సజీవమైనది’.*

విశ్వాసులు ‘జీవంతో కూడిన నిరీక్షణ’ పొందగలిగేలా ‘మరలా జన్మిస్తారు’.

అపొస్తలుడైన పేతురు క్రైస్తవులను ‘ఏర్పరచ బడినవారు’ అని అంటూ వాళ్లకు రెండు పత్రికలు రాశాడు. (1 పేతు. 1:1)

చిన్నమందకు దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన నిరీక్షణ గురించి ఆయన వివరాలు ఇచ్చాడు. ఆయన తన మొదటి పత్రికలో ఇలా రాశాడు.

“మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన *జీవముతో కూడిన నిరీక్షణ* మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలు పరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు.”—1 పేతు. 1:3-6.

పరలోక రాజ్య ప్రభుత్వంలో క్రీస్తుతో పాటు ఉండేందుకు దేవుని కుమారులుగా ‘మరలా జన్మించాలి.’ క్రీస్తుతో పాటు రాజులుగా, యాజకులుగా ఉండడానికి దేవుడు మనలను పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. (ప్రక. 20:6)

‘మరలా జన్మించడం’ వల్ల మనం ‘జీవంతో కూడిన నిరీక్షణ’ పొందుతామని పేతురు అన్నాడు. ఆ నిరీక్షణను ఆయన “పరలోకమందు” భద్రపర్చబడివున్న “అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము” అని అన్నాడు. సజీవమైన ఆ నిరీక్షణ వల్ల “మిక్కిలి ఆనందం” పొందుతారంటే అందులో ఆశ్చర్యం లేదు!

అయితే, నమ్మకంగా ఉంటేనే మనం తమ బహుమానాన్ని పొందుకుంటాం. మన పిలుపును నిశ్చయం చేసుకోవడానికి శాయశక్తులా మనం కృషిచేయాలి. 

క్రైస్తవులు తమ “పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు” శాయశక్తులా కృషిచేయాలని పేతురు తన రెండవ పత్రికలో వాళ్లను ప్రోత్సహించాడు. (2 పేతు. 1:10)

విశ్వాసం, దైవభక్తి, సహోదర అనురాగం, ప్రేమ వంటి లక్షణాలను పెంపొందించు కోవడానికి మనం తీవ్రంగా కృషి చేయాలి. ‘ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండ చేయును’ అని పేతురు అన్నాడు.—2 పేతురు 1:5-8 .

ఫిలదెల్ఫియ సంఘంలో ఉన్న పెద్దలకు ఒక సందేశాన్ని ఇస్తూ ప్రభువు ఇలా చెప్పాడు: “నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధనకాలములో నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.” ప్రక. 3:10,11

క్రైస్తవులు మరణం వరకు నమ్మకంగా ఉంటేనే “వాడబారని మహిమ కిరీటము” పొందుతారు.—1 పేతు. 5:4; ప్రక. 2:10.

చాలామంది ప్రభుత్వాలు స్థిరముగా ఉండడంపై, వ్యాపారాల్లో లాభాలు గడించడంపై, మంచి ఆరోగ్యం కోసం లేదా ఉద్యోగ విరమణ తర్వాత సంతృప్తికరమైన జీవితం కోసం నిరీక్షణ కలిగి  ఎదురుచూడడంలో తమ భవిష్యత్తు ఆధారపడివుందని కొందరు అనుకుంటారు. కానీ అవి జరుగవచ్చు జరుగక పోవచ్చు. అందువలన అది మృతమైన నిరీక్షణ. కారణం
వాటిలో ఏవీ కూడా సంతోషకరమైన భవిష్యత్తు ఉంటుందని నమ్మేందుకు బలమైన ఆధారాన్ని ఇవ్వలేవు. కాని జీవముగల  దేవుని యందు నిరీక్షణ ఉంచడమనేది అమితమైన సంతోషాన్ని ఇస్తుంది. మీకు మేలు ఖచ్చితంగా చేస్తుంది. అందుకే అది జీవముగల నిరీక్షణ ఆని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు: “జీవముగల దేవుని యందు మనము నిరీక్షణ నుంచి యున్నాము.”—⁠1 తిమోతి 4:10.

Comments

Popular Posts